Summer Effect : బయటకు వెళ్తే మటాష్... ఎండల దెబ్బకు హాంఫట్
ఉష్ణోగ్రతలు భారీ పెరిగాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలు భారీ పెరిగాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంత వేగంగా వేసవి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా మార్చి నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత ప్రారంభమవుతుంది. కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు గత సీజన్ తో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూలుగా అయితే శివరాత్రికి చలి తగ్గి ఎండలు ప్రారంభమవుతాయి. కానీ ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే ఎండలు అధికంగా ఉండటంతో ఇక రానున్న కాలంలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
అధిక ఉష్ణోగ్రతలు...
గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సహజంగా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి నెలలో నమోదవుతాయి. కానీ ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉక్కపోత కూడా అధికంగా ఉంది. ఇళ్లలో ఉన్న వారే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్నారు. బయట తిరగాల్సిన వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయట తిరిగే సమయంలో తలకు క్యాప్ ధరించడంతో పాటు కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు వీలయినంతగా ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
విద్యుత్తు వినియోగం...
మరోవైపు ఫ్యాన్లతో పాటు ఏసీలు కూడా ఆన్ అయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడానికి ఏసీలను సర్వీసింగ్ చేయించుకునే వారు ఇటీవల కాలంలో అధికమయ్యారు. మరోవైపు విద్యుత్తు వినియోగం కూడా తెలంగాణలో మరింత పెరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 3,450 మెగావాట్ల విద్యుత్తు వినియోగం అయిందని చెబుతున్నారు. విద్యుత్తు బిల్లులు ఏప్రిల్ నెల నుంచి కొంత అధికంగా వస్తుంటాయి. కానీ ఫిబ్రవరి నెల నుంచే అధిక బిల్లులు వస్తుండంతో విద్యుత్తు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు ఈ వేసవిలో ఎండల తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు.