Telangana : ఇక వరసగా బీజేపీ అగ్ర నేతల పర్యటనలు.. కారణమిదే

భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధమవుతుంది

Update: 2026-03-21 13:00 GMT

భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మొత్తం మూడు వందల వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో విజయం సాధించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దాదాపు నలభైకి పైగా వార్డులను గెలుచుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి కూడా అదే స్థాయిలో డివిజన్లను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ముందు నుంచే వ్యూహాలను మొదలు పెట్టింది.

మోదీ రాకతో...
ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే హైదరాబాద్ కు రానున్నారు. కేరళ పర్యటనకు వచ్చిన సందర్భంగా మార్గ మధ్యంలో హైదరాబాద్ లో ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా తేదీలు ఖరారు కాలేదు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నలుమూలల నుంచి కార్యకర్తలను ప్రజలు సమీకరించాలని నిర్ణయించారు. మోదీ రాకతో మరింత బీజేపీ విజయావకాశాలు మెరుగు పడతాయని నేతలు అంచనా వేస్తున్నారు.
మూడు కార్పొరేషన్ల పరిధిలో...
కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో మూడు వందల డివిజన్లున్నాయి. అయితే ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేసి వారిని జనంలోకి పంపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నగరంలో సర్వేలు కూడా చేయిస్తునట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో బీజేపీకి కొంత పట్టు ఉండటంతో దానిని నిలుపుకునే దిశగా బీజేపీ ఈ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక వరసగా కేంద్ర మంత్రులను కూడా హైదరాబాద్ కు రప్పించి వివిధ పనులను ప్రారంభించాలని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇక వరస బెట్టి మోదీ నుంచి కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు రానున్నారని తెలిసింది.





Tags:    

Similar News