ఇంద్రపాలనగరం గుట్టపై కొత్త రాతి యుగ ఆనవాళ్లు

శంకరగుట్ట వద్ద 4 వేల ఏళ్ల చరిత్రకు సంకేతాలు ఆనవాళ్లు కాపాడాలన్న శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి

Update: 2026-03-20 12:16 GMT

భువనగిరి, రామన్నపేట, మార్చి 19: యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం-తుమ్మలగూడెం శివారులో మూసీనది ఒడ్డున ఉన్న శంకరగుట్టపై కొత్త రాతి యుగానికి చెందిన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రక గుర్తులను కాపాడాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

గుట్టపై ఉన్న పార్వతి శంకర స్వామి ఆలయ పరిసరాల్లో కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందిన శిలాతోరణ శకలాలు, శాసనాలను పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా సమీపంలో మరో ఆలయం కుడివైపున ఉన్న బండపై రెండు చోట్ల రాతిని నూరిన గాట్లు కనిపించాయి. ఇవి సుమారు 4 వేల సంవత్సరాల క్రితం రాతి గొడ్డళ్లను పదును పెట్టేందుకు చేసినవని ఆయన తెలిపారు. ఈ గాట్లు కొత్త రాతి యుగానికి చెందినవని స్పష్టం చేశారు.

మూసీ నది సమీపంలో ఉండటం వల్ల నీటి వనరులు అందుబాటులో ఉండేవని, గుట్టపై సహజంగా ఉన్న రాతి గుహలను తాత్కాలిక నివాసాలుగా ఉపయోగించి ఉండవచ్చని శివనాగిరెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత పురాతన దేవాలయ పునరుద్ధరణ సంస్థ అధ్యక్షుడు ఆర్కే జైన్, యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News