Telangana : ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత తీర్పు నేడు.. రేపు సుప్రీంలో విచారణ
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు మరికాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు మరికాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. దీంతో రాజకీయంగా ఉత్కంఠగా మారింది. అయితే ఈరోజు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల పిటీషన్లపై మాత్రమే తీర్పు ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ నెల 18వ తేదీలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఐదుగురు ఎమ్మెల్యలేకు సంబంధించి అనర్హత పిటీషన్లపై మాత్రమే తీర్పు వెలువరించనున్నారు.
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై...
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లపైనే నేడు తీర్పువెలువడనుంది. ఈరోజు ఐదుగురు పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నది స్పీకర్ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ తీర్పు వెలువడనుంది. మొత్తం పది మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే స్పీకర్ కార్యాలయం విచారణ చేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరడంతో స్పీకర్ గడువు ఇచ్చారు.
ఎనిమిది మందిని విచారించిన...
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది సభ్యులను మాత్రమే విచారించిన స్పీకర్ కార్యాలయం త్వరలోనే మిగిలిన ఇద్దరి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు సంబంధించిన వివరణ అందిన తర్వాత విచారణ చేపట్టనున్నారు. కానీ ఈ ఇద్దరిపై మాత్రం అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ పై మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశముంది. ఇక్కడ ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం వల్ల ఆయనపై ఖచ్చితంగా వేటు పడే అవకాశముందని అంటున్నారు. మిగిలిన వారి సంగతి మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు మధ్యాహ్నానికి ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్ తేలనుంది. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలోఈరోజు తీర్పు ఎలా వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.