పడకల్ లో విజయనగర కాలపు శిల్పాలను పదిలపరచాలి!
పడకల్ లో 400 సం||ల శిల్పాలు.కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
తలకొండపల్లి, ఫిబ్రవరి,2: మండల కేంద్రానికి 7 కి.మీ.ల దూరంలో ఉన్న పడకల్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో విజయనగర కాలపు శిల్పాలను పదిలపరచాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ఆలయ ఛైర్మన్ డా. లట్టుపల్లి రాజ్ కుమార్ రెడ్డి ఆహ్వానంపై సోమవారం నాడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విజయనగర కాలపు వినాయకుడు, పద్మావతి దేవి పీఠం, ఇంకా జయ, విజయ ద్వారపాలకులు, ద్వారం పై గజలక్ష్మి, శంఖు, చక్రాల శిల్పాలున్న భిన్నమైన ద్వార శాఖలను పరిశీలించారు. ఒక బండ రాతిపై చెక్కిన వినాయకుని పై చేతుల్లో పాశాంకుశాల స్థానంలో త్రిశూలం, డమరుకం ఉన్నాయనీ, పద్మావతి పీఠంపై విజయనగర శైలిలో చెక్కిన నాట్యగత్తె, పరిచారిక శిల్పాలు గ్రామ చరిత్రను 400 సంవత్సరాలకు తీసుకెళుతున్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలను కాపాడుకోవాలని ఆలయ ఛైర్మన్ కు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆలయంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఛైర్మన్, ఇంకా సభ్యులు లట్టుపల్లి చందన్ కుమార్ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి పడకల్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పలు సూచనలు చేశారు.