Telangana : తాగి ఊగండి.. ఓటేయండి.. రికార్డు బ్రేక్ చేయనున్న మద్యం అమ్మకాలు
స్థానిక ఎన్నికలతో తెలంగాణ మద్యం విక్రయాలు రికార్డు బ్రేక్ చేయనున్నాయి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల అమ్మకాలు విపరీతంగా పెరిగే అవకాశముందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. గ్రామ స్థాయి నుంచి వార్డులు, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు కూడా వరసగా జరిగే అవకాశముంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయితే పంచాయతీకి కోటి రూపాయలు నిధులు ఇస్తానని కూడా ముందుకు వస్తుండటంతో ఇక ఎన్నికలు జరిగితే ఏ రేంజ్ లో ఖర్చు పెడతారన్నది ఊహకు అందని విధంగా ఉంది. ఇక ఈ ఏడాది మాత్రమే కాదు రానున్నది డిసెంబరు నెలలో పండగలతో పాటు డిసెంబరు 31వ తేదీతో పాటు సంక్రాంతి పండగ వంటివి ఉండటం కూడా మద్యం షాపులు దక్కిన వాళ్లు లక్కున్నోళ్లని చెప్పాలి.
ఇటీవలే లాటరీ ద్వారా...
ఇటీవల తెలంగాణలో మద్యం షాపులకు లాటరీ ద్వారా కేటాయించారు. మద్యం దుకాణాలకు కూడా భారీగా భారీగా దరఖాస్తులు అందాయి. మొత్తం 95,137 దరఖాస్తులు అందాయి. 2,620 మద్యం షాపులకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేరాయి. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో 29,420 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్‌లో 4,154 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం షాపులకు డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కొన్ని దుకాణాలను కేటాయించారు. మద్యం దుకాణాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దరఖాస్తులు చేశారు. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు 2,800 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.
పల్లె నుంచి పట్నం వరకూ...
ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమరంతో మద్యం విక్రయాలు ఊపందుకోనున్నాయి. ఇందుకు ఎక్సైజ్ శాఖ కు కూడా పెద్ద సంఖ్యలో తమకు సరుకు కావాలంటూ మద్యం దుకాణాల నుంచి ఇండెంట్లు వస్తున్నాయి. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, మున్సిపాలటీ కౌన్సిలర్, ఛైర్మన్, కార్పొరేషన్ కౌన్సిలర్, మేయర్ వంటి పదవుల కోసం పెద్దయెత్తున మద్యం కోసం ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వానికి మాత్రమే కాకుండా మద్యం దుకాణాలను దక్కించుకున్న వారికి కూడా పెద్ద మొత్తంలో ఈ ఏడాది ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. పల్లె నుంచి పట్నం వరకూ మద్యం విషయంలో ఎన్నికల సమయంలో ఎవరూ రాజీ పడరు. దీంతో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.