Telangana : కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నల వల్ల నష్టం ఎవరికి? అంచనాలు ఏంటంటే?
తెలంగాణ రాజకీయాలు నిరంతరం హాట్ హాట్ గానే ఉంటాయి. కొత్త పార్టీలు ఎప్పటికప్పడు పుట్టుకొస్తుంటాయి
తెలంగాణ రాజకీయాలు నిరంతరం హాట్ హాట్ గానే ఉంటాయి. కొత్త పార్టీలు ఎప్పటికప్పడు పుట్టుకొస్తుంటాయి. కొన్ని పార్టీలు పెట్టి ఆ తర్వాత వేరే పార్టీలో విలీనం చేస్తుండటం కూడా తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన కోదండరామ్ పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించలేదు. అలాగే అనేక మంది కొత్త పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మాత్రమే ప్రజలు ఆదరిస్తున్నారు. అనేకసార్లు జరిగిన విషయాల్లో ఈ విషయం స్పష్టమైంది.
బీసీల ఆత్మగౌరవమే...
అయితే తాజాగా మరికొన్ని కొత్త పార్టీలు తెలంగాణలో వచ్చేశాయి. కొన్ని పార్టీలు వచ్చేశాయి. మరికొన్ని పార్టీలపై ప్రకటన రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆయన జనంలోకి వెళ్లనున్నారు. జెండా,అజెండాను కూడా ప్రజలముందుంచారు. వెనకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు, వారి ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగాపార్టీ పనిచేస్తుందని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రారంభించానని తెలిపారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బీసీలు ఈ పార్టీని సొంతం చేసుకుని ఆదరించాలన్నారు.
అధికారిక ప్రకటన లేకున్నా...
అలాగే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మరో ఎమ్మెల్సీకల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. అయితే దీనిపై కవిత అధికారికంగా ప్రకటన చేయలేకపోయినా ప్రస్తుతం ఆమె తెలంగాణ జాగృతి పేరిట జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కల్వకుంట్ల కవిత కూడా బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి వాదులతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని అభిమానించే వారు తనను ఆదరిస్తారని కల్వకుంట్ల కవిత నమ్ముతున్నారు. అయితే తనతండ్రి స్థాపించిన బీఆర్ఎస్ ను కాదని, తండ్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ పెడతారా? అంటే చెప్పలేమంటున్నారు. సస్పెన్షన్ కు గురైన కవిత పార్టీ పెడతారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో...
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఇటు తీన్మార్ మల్లన్నకు చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరుపున తమ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ బలం ఏంటో చూపించడానికి ఈ ఇద్దరు నేతలు సిద్ధమవుతున్నారు. అయితే వీరి వల్ల ఏ పార్టీకి నష్టం? ఏ పార్టీకి లాభం? అన్న చర్చ జరుగుతుంది. ఒకరు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగా, మరొకరు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయి వేరే పార్టీ పెట్టుకున్నారు. వీరిద్దరి వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరి సత్తా ఏమిటో బయటపడుతుందన్న కామెంట్స్ మాత్రం వినపడుతున్నాయి.