Telangana Assembly : కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్
కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ స్వల్పకాలిక చర్చను అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభించారు. బ్యారేజీ కట్టి డ్యామ్ లా వాడుకోవాలనుకున్నారని అన్నారు. ప్రాజెక్టు కూలిపోయింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనన్న విషయాన్ని మర్చి పోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. డిజైన్లలో లోపం, నిర్వహణ లేకపోవడం వంటి వాటివల్లనే ప్రాజెక్టు కూలిపోయిందని అధికారులు కూడా అభిప్రాయపడ్డారన్నారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినా అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండి పడ్డారు.
మేడిగడ్డ కూలిన తర్వాత కూడా...
మేడిగడ్డ కూలిన తర్వాత కూడా తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. ఎన్డీఎస్ఏ సూచనలు చేసినా, అధికారులు హెచ్చరించినా నీటి నిల్వను తగ్గించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ గా నియమించామని, విచారణ చేయించామని ఉత్తమ్ తెలిపారు. కమిషన్ రిపోర్టు రాగానే తాము చర్యలకు దిగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రివర్గంలో చర్చించినా, అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అవసరమైన చర్యలకు దిగాలని నేడు అసెంబ్లీలో ఈ కమిషన్ నివేదికను పెట్టామన్నారు. తమకు ఎవరిపై కక్ష సాధింపు చర్యలు లేవని, పక్షపాతంగా వ్యవహరించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.