Revanth Reddy : తెలంగాణ జాతిపిత తాగుబోతోడు అవుతాడా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినోళ్లు జాతిపిత అవుతారా? తాగుబోతోడు జాతి పిత అవుతారా? అని ఆ పొడుగాయనను ప్రశ్నిస్తున్నానంటూ హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. గత పదేళ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్న రేవంత్ రెడ్డి, దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి తమకు అప్పగించిపోయారని, ఆయన చేసిన అప్పులకు తాము వడ్డీ కడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేసిన అప్పుల గురించి తెలియాలన్న రేవంత్ తాము ఆర్థిక సమస్యలున్నా వాటిని అధిగమిస్తూనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇచ్చిన హామీలను...
స్టేషన్ ఘన్ పూర్ లో దాదాపు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన ఎన్నికల వాగ్దాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేశామన్న రేవంత్ ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్ కు ఎయిర్ పోర్టును కూడా తెచ్చుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాళేశ్వరం కాదని, కూలేశ్వరం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజెక్టులపై కేసీఆర్ తమతో చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టు అయినా తాను చర్చకు సిద్ధమని అందుకు సిద్ధమా? అని వేదికపై నుంచి ఛాలెంజ్ విసిరారు.