Telangana : చుక్క నీరు కూడా వదలబోం..ఎంత వరకైనా పోరాడతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు

Update: 2025-08-15 05:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరొకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సాగునీరు చుక్కనీటిని కూడా ఇతరులు తరలించకుండా పోకుండా ఉండేందుకు అన్ని రకాలుగా తాము వ్యూహాలు రూపొందించుకుంటున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఎవరు తరలించుకుపోయే ప్రయత్నాన్ని అయినా అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.

కృష్ణా, గోదావరి నదిలో...
కృష్ణా, గోదావరి నదిలో ప్రతి చుక్క నీరు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిందేనని అన్నారు. ఇందుకోసం ఎంతదాకైనా పోరాడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరెన్ని ఎత్తులేసినా చిత్తు చేస్తామన్న రేవంత్ రెడ్డి సెంటిమెంట్ రెచ్చగొట్టే వారి మాటలను వినవద్దని కోరారు. ఎవరి బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం తమది కాదని ఆయన అన్నారు. గత పదేళ్ల నుంచి ప్రజాస్వామ్యం అంటే తెలియకుండా నడిపిన ప్రభుత్వాన్ని పారదోలి తమకు అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పేదలకు సన్న బియ్యం పంచిపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదని, తాము వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు అర్హులందరికీ అందాయని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరం...
హైదరాబాద్ నగరం మనకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్న ఆయన హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలను రచిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం భావిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈరోజు కురుస్తున్న భారీ వర్షాలు కాలనీలు, రోడ్లమీద పడుతున్నాయంటే దానికి కారణం నాలాలు, చెరువుల ఆక్రమణలేనని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కూడా తమ్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా అభివృద్ధి ఆగబోదని ఆయన అన్నారు.
Tags:    

Similar News