Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఒకరకంగా మంచే జరిగిందా? దిద్దుబాట్లు చేసుకోనున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఒకరకంగా మంచే జరిగిందని చెప్పాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఒకరకంగా మంచే జరిగిందని చెప్పాలి. ఏడాది పూర్తయిన తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయినా తన పాలనలో లొసుగులను ఆయన గమనించే అవకాశాలను ఈ ఎన్నిక ఫలితాలు కల్పించిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో ఆయన పాలనను సజావుగా నడుపుతున్నారని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు కొన్ని అమలు పరుస్తూ ఉన్నా ఆయన ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సక్రమంగా, సమర్థవంతంగా ప్రజలకు తెలియజెప్పడంలో పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు.
పదేళ్ల పాలనతో పోల్చుకుంటే...?
గత పదేళ్ల పరిపాలనతో పోలిస్తే ప్రజలకు స్వేచ్ఛ లభించింది. నాయకులు కూడా నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. ఇక ఆందోళనలు చేసి మరీ తమ డిమాండ్లను సాధించుకునే అవకాశం కూడా కాంగ్రెస్ సర్కార్ లోనే సాధ్యమవుతుంది. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఏం జరిగిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా ప్రజలకు తెలియజెప్పలేకపోయింది. అలాగే ఉద్యోగ సంఘాల నుంచి అందరూ తమ డిమాండ్లను నేరుగా చెప్పుకోవడమే కాకుండా పట్టుబట్టి సాధించుకునే అవకాశం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లభిస్తుందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అయితే అదే సమయంలో కొన్ని తప్పులు కూడా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నేతలు పదవులపైనే...
హామీలు అమలు చేయడంలోనూ, ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఆ విషయాన్ని కూడా సక్రమంగా ప్రజలకు వివరించలేకపోతుంది. గత పదేళ్ల పాటు ప్రజలు తమ ఆందోళనలను అణిచి వేసుకున్న తీరును కూడా ఎండగట్టలేకపోతుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీనేతలు కూడా పదవుల కోసం పాకులాట తప్పించి ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటే తమకు పదవులు వస్తాయని గుర్తించలేకపోతున్నారు. పదవుల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెడుతున్నారు. అలాంటి వారిపై ఇప్పుడే చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో పార్టీ మనుగడకు, ప్రభుత్వం పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని అంటున్నారు.
సోషల్ మీడియా డల్ గా...
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా పూర్తిగా డల్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నా దానికి ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకూ యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా టీం తర్వాత డల్ అయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నాయి. సోషల్ మీడియా వింగ్ ను కాంగ్రెస్ బలోపేతం చేసుకోగలగాలి. అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ వాటిని సమర్ధవంతంగా ప్రజలకు చేరవేయలేకపోయారు. అందుకే ఇది రేవంత్ రాజకీయ ప్రయాణానికి ఒక సిగ్నల్ అనే చెప్పాలి. వీటిని అధిగమించగలిగితేనే రేవంత్ అనుకుంటున్నట్లు రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగలదు.