BJP : తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీని మార్చినట్లుందిగా?
మున్సిపల్ ఎన్నికలు త్వరలో తెలంగాణలో జరగనున్నాయి.
మున్సిపల్ ఎన్నికలు త్వరలో తెలంగాణలో జరగనున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో బీఆర్ఎస్ లో సంక్షోభం మరో పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత ఇకపై తనకు బీఆర్ఎస్ తో సంబంధం లేదని స్పష్టం చేశారు. మరొక కొత్త పార్టీ కూడా పెడతామని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కొంత అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభంతో ఇబ్బంది పడుతుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ ఈ గ్యాప్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న బీజేపీకి గెలుపు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చంటున్నారు.
రెండు పార్టీలపై...
బీజేపీ తెలంగాణలో బలపడుతూ వస్తుంది. బీఆర్ఎస్ లో లుకలుకలు, కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇప్పటికే బీజేపీ నేతలు సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహలపై చర్చించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలతో జరిగిన భేటీలో కూడా తెలంగాణలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సమిష్టిగా కలసి పనిచేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. రెండు పార్టీల కంటే బీజేపీ మేలు అన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం జిల్లాల వారీగా పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను ఇతర రాష్ట్రాల నేతలకు ఇన్ ఛార్జులుగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం.
స్థానిక సంస్థల్లో బలపడితేనే...
స్థానిక సంస్థల్లో బలపడితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దగ్గర దారి అవుతుందని బీజేపీ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడంతో మున్సిపల్ ఎన్నికలపైనైనా సీరియస్ గా దృష్టి పెట్టాలని చూస్తుంది. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టడంతో ఈసారి కూడా పట్టణాల్లో గ్రిప్ పెంచుకోవడానికి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రెండు పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని చెప్పి, కేంద్రం నుంచి నిధులు తెచ్చి పట్టణాలను బాగు చేస్తామన్న నినాదంతో బీజేపీ నేతలు జనం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మీద ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ పడుతున్న శ్రమ ఏ రకంగా ఫలితాలనిస్తుందన్నది చూడాలి.