Telangana : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం ఊపేస్తుందా?

Telangana : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం ఊపేస్తుందా?

Update: 2025-08-30 03:49 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హాట్ హాట్ గా ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించడానికే. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని తెలిసింది. బిజినెస్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో ఎన్ని రోజలు సభను నడపాలన్నది చర్చించనున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చించి యాక్షన్ ప్లాన్ కు ప్రభుత్వం దిగే అవకాశముంది.

కమిషన్ ఇచ్చిన నివేదికలో
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు, ఈటల రాజేందర్ తో పాటు ఐఏఎస్, నీటిపారుదల శాఖ అధికారుల పేర్లను కూడా చేర్చారు. వీటిపై చర్చించడానికే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు సమావేశాల్లో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పక్షాల అభిప్రాయాలను ఈ నివేదికపైనే తీసుకునే అవకాశముంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, వరదలు, బీసీ రిజర్వేషన్లు...
కానీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆయన హాజరై కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసీఆర్ హాజరై కాళేశ్వరం నిర్మాణంతో రైతులకు ఏ విధంగా ఉపయోగకరమన్నది వివరించాలని బీఆర్ఎస్ క్యాడర్ కోరుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఎర్రవెల్లి ఫాం హౌస్ లో పార్టీ నేతలతో ఆయన సమావేశమై చర్చించారు. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, భారీ వరదలతో జరిగిన నష్టంపై చర్చించాలని విపక్షాలు పట్టు బట్టే అవకాశముంది. బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా చర్చించే అవకాశముంది. వీటన్నింటికన్నా కాళేశ్వరం నివేదికపై చర్చ మాత్రమే హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. ఈరోజు మాత్రం మృతి చెందిన సభ్యులకు సంతాపం చెప్పిన తర్వాత సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది చర్చించనున్నారు.


Tags:    

Similar News