Telangana : నేడు కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది.

Update: 2025-08-31 04:25 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. ముందుగా ఈ చర్చను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ ప్రారంభించనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలకు దిగనుందన్న ప్రకటనకూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవకాశముంది.

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్...
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికలో ఇప్పటికే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నాడు మంత్రులుగా ఉన్న హరీశ్ రావు, ఈటల రాజేందర్ లను కూడా కారకులుగా పేర్కొన్నారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించడం కూడా జరిగిందని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైన ప్రదేశంలో జరగలేదని కూడా కమిషన్ అభిప్రాయపడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను జూన్ 31వ తేదీన ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే.
తదుపరి చర్యలపై ప్రకటన...
కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై ఇప్పటికే మంత్రి వర్గం చర్చించి అసెంబ్లీలో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టుకు కూడా తాము త్వరలోనే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికను ప్రవేశపెడతామని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీలకు మాట్లాడేందుకు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. దీంతో నేడు అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం కానుంది. ఎన్నిరోజులైనా కాళేశ్వరంపై మాట్లాడతామని, కమిషన్ నివేదిక తప్పుల తడక అని బీఆర్ఎస్ వాదిస్తుంది. మొత్తం మీద నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది.
Tags:    

Similar News