సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత

కుందా సత్యనారాయణ చిన్న కొడుకు సురేందర్ అనారోగ్యంతో మృతి చెందగా.. అతని జ్ఞాపకార్థంగా యాదగిరి గుట్ట సమీపంలో

Update: 2022-01-13 05:23 GMT

యాదాద్రికి అతి సమీపంలో ఉన్న..ప్రముఖ పుణ్యక్షేత్రం సురేంద్రపురి.. కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. 1938 జూన్ 15వ తేదీన జన్మించిన ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

కుందా సత్యనారాయణ చిన్న కొడుకు సురేందర్ అనారోగ్యంతో మృతి చెందగా.. అతని జ్ఞాపకార్థంగా యాదగిరి గుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం వద్ద సురేంద్రపురి పేరుతో హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ కళాధామంలో.. భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే శివుడు, నాగదేవత భారీ విగ్రహాలతో పాటు మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలకు దృశ్యరూపమిచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2009, ఫిబ్రవరి 8న ప్రారంభమైన 'సురేంద్రపురి' తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.




Tags:    

Similar News