Telangana : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ 6న ప్రారంభం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఈ నెల 6వ తేదీ నుంచి విచారణ ప్రారంభించనున్నారు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఈ నెల 6వ తేదీ నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొందరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని కోరారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం సూచనల మేరకు ఇప్పటికే గడ్డం ప్రసాదరావు విచారణను ప్రారంభించారు. ఇప్పటి వరకూ పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిపారు.
నలుగురు ఎమ్మెల్యేలకు...
ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలను విచారించేందుకు తమకు రెండు నెలలు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి తిరిగి స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణను ప్రారంభించనున్నారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఈ మేరకు విచారణ చేయాలని నిర్ణయించారు. పార్టీ మారినట్లుగా ఆరోపణలున్న పోచారం శ్రీనివాసులు రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ లను విచారించాలని నిర్ణయించారు. 6వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్ పిటీషన్లపై విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాసర రెడ్డి, అరికెపూడి గాంధీ విచారణ జరగనుంది. తిరిగి 12వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్ పై రెండో సారి విచారణ జరగనుంది. 13న పోచారం శ్రీనివాసులు రెడ్డి, అరెకపూడి గాంధీపిటీషన్లపై రెండోసారి విచారణ జరుపుతారు.