Breaking : జూబ్లీహిల్స్ లో నో.. సెంటిమెంట్ ఓన్లీ డెవలెప్ మెంట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ మరోసారి పనిచేయలేదని స్పష్టమవుతుంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ మరోసారి పనిచేయలేదని స్పష్టమవుతుంది. సెంటిమెంట్ కంటే మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండనుండటంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించినా ప్రయోజనం ఏమీ లేదని ఓటర్లు భావించినట్లు కనపడుతుంది. ఎందుకంటే గతంలో పాలేరు, దుబ్బాక, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ నాటి అధికార పార్టీయే గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్లు కేటాయించినా ప్రజలు అటు వైపు చూడలేదు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి పాలేరులో ఓటమి పాలయ్యారు. తర్వాత దుబ్బాకలోనూ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడి కాంగ్రెస్ గెలిచింది.
మరో మూడేళ్ల పాటు...
ఇలా తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల చరిత్ర చూస్తే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓటర్లు ఆదరించలేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లోనూ అదే పంథాను ప్రజలు అవలంబించినట్లుంది. ప్రతిపక్షంలో ఉన్న వారిని గెలిపించినా తమ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం లేదన్నది ఓటర్ల ఆలోచన కావచ్చు. అందులోనూ కొంత నిజముంది. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కష్టం. అదే అధికార పార్టీ గెలిస్తే కొంత నిధులు నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచన కూడా ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించాయని చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేసినా అది వృధాయేనని భావించి ఎక్కువ మంది ప్రజలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వైపు నిలిచారు.
ఏడో రౌండ్ వచ్చేసరికి...
మొదటి రౌండ్ మినహాయించి ఇక మిగిలిన అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఆధిక్యత లభించడం చూస్తే అనేక అంశాలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపాయని అనుకోవాలి. అంతే తప్ప బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు పూర్తిగా కనుమరుగై పోయిందనుకోవడానికి వీలులేదు. గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ ఇక్కడ గెలిచిన పార్టీ. అది గుర్తుంచుకోవాలి. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి నలభై వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. పార్టీ అభ్యర్థి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారారనుకోవాలి. బస్తీల్లో పట్టున్న నవీన్ యాదవ్ కుటుంబానికి ఎక్కువ మంది ఓటర్లు అండగా నిలిచారనడంలో సందేహం లేదు. ఏడో రౌండ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 19 వేల ఓట్లు పై చిలుకు ఆధిక్యత లభించడంతో మెజారిటీ ఇరవై వేల రపాయలు పైగానే ఉంటుందని అంచనా.