Telangana : విజృంభిస్తున్న డెంగ్యూ... సీజనల్ వ్యాధులతో మంచం పడుతున్న జనం

తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు

Update: 2025-08-26 04:30 GMT

తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో పాటు చలి వాతావరణం నెలకొని ఉండటంతో అనేక మంది అస్వస్థతకు గురై ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ తో తెలంగాణ ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, నీరసంతో పాటు జ్వరంతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెడుతుంది. తాగునీరు కాచి వడపోచి తాగకపోవడంతో కలుషిత నీటి వల్ల కూడా ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు చెబుతున్నారు. జర్వంతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకంటున్నారు.

ఇన్ పేషెంట్లుగా చేరి...
ఇందులో కొందరు ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి ప్రతి రోజుకు 750 మంది రోగులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో రోజుకు మూడు నుంచి నాలుగు వందలకు మించి ఈ సంఖ్య ఉండదంటున్నారు. ఇక నీలోఫర్ ఆసుపత్రికి కూడా రోజుకు రెండు వేల మంది బాధితులు వస్తున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి మంది మాత్రమే వస్తారని వైద్యులు చెబుతున్నారు. ఓపీ సంఖ్య పెరిగిపోవడంతో ఈ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్వరంతో వచ్చిన వారికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు కూడా చేయించాల్సి రావడంతో ఆలస్యమవుతుందని రోగులు బంధువులు చెబుతున్నారు.
అత్యధికంగా డెంగ్యూ కేసులు...
డెంగ్యూ కేసులు కూడా నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల మున్సిపాలిటీలు, పంచాయతీలకు దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తగా డెంగ్యూ కేసులు దాదాపు 3500 కుపైగానే నమోదయ్యాయని అంటున్నారు. మలేరియా కేసులు కూడా అత్యధికంగా వస్తున్నాయి. డెంగ్యూ వస్తే ప్రయవేటు ఆసుపత్రికి వెళితే దోచుకు తింటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని రోగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే సీజనల్ వ్యాధుల నియంత్రణకు నడుంబిగించాలన్న డిమాండ్ వినపడుతుంది.


Tags:    

Similar News