Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లను తెలంగాణ నుంచి బహిష్కరించండి
కులగణన సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్ ను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు
కులగణన సర్వేలో ఈసారి పాల్గొనకపోతే కేసీఆర్ ను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కులగణనపై దుష్ప్రచారం విపక్షాలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపారని ఆయన అన్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు బలిసి కులగణన సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదన్నారు. తమ సర్వే తప్పని ఎలా అంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పారదర్శకంగా చేసినా...
రాష్ట్ర వ్యాప్తంగా కులగణన పారదర్శకంగా చేశామని చెప్పారు. బీసీ ఈ గ్రూపు కింద నాలుగు శాతం రిజ్వేషన్లు ఉన్నాయని తెలిపారు. కులగణనపై ప్రణాళిక ప్రకారమే తాము ముందుకు వెళతామని తెలిపారు. తమ ప్రభుత్వం వర్గీకరణను కూడా అమలు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మోదీ బీసీ కాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అని అన్నారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఏ త్యాగానికి సిద్దమయ్యే కులగణన చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. మైనారిటీ లెక్కలు ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారని, కులగణన పక్కాగా నిర్వహించామని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని తన మంత్రివర్గం చేసిందన్నారు.
గొప్ప లక్ష్యం ముందు...
ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న చిన్న ఆరోపణలకు రియాక్ట్ కావద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయాలని, ఏ లెక్క తప్పుందో రుజువు చేయాలని సవాల్ చేయమని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈసారి కేసీఆర్ సర్వేలో పాల్గొనకపోయినా, వివరాలను అందించకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను బహిష్కరించాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కులగణన సర్వే అనేది బలహీన వర్గాల ప్రయోజనం కోసమే చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంపై ఏదో రకంగా ఆరోపణలు చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కులగణన ప్రజలకు ఎలాంటి నష్టం చేకూర్చదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.