Revanth Reddy : అందుకే ఈ నిర్ణయం .. క్రెడిట్ వాళ్లకు వెళ్లకుండా పక్కాగా ప్లాన్

తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయింది

Update: 2024-02-24 02:57 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసింది. మరో రెండు గ్యారంటీలను అమలు చేయడానికి సిద్ధమయింది. ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ఈ రెండు గ్యారంటీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు తో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు కొన్ని నిబంధనలను కూడా అమలు చేయాలని నిశ్చయించింది.

లబ్దిదారుల ఖాతాల్లో...
తెల్లరేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాలను వర్తించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం లబ్దిదారులు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే 955 రూపాయలు పెట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు కూడా సిలిండర్ ను గ్యాస్ కంపెనీ నుంచి బుక్ చేసుకుని వారికి చెల్లించాల్సిందే. అయితే ఆ తర్వాత 455 రూపాయలను మాత్రం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
అపోహ పడకుండా...
దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అధికమొత్తంలో గ్యాస్ సిలిండర్ కు డబ్బులు వసూలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తమకు నగదును చెల్లిస్తుందన్న భావన వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. లేకుంటే కేంద్ర ప్రభుత్వమే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్న అపోహ ఏర్పడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో తాము ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది లబ్దిదారులున్నట్లు గుర్తించింది. ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే ఇది వర్తిస్తుంది.


Tags:    

Similar News