Revanth Reddy : అమరులైన పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం ఎంతంటే?
అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్ లో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ లో రౌడీషీటర్ దాడిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని తెలిపారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వారికి మూడు వందల గజాల ఇంటి జాగాతో పాటు ప్రమోద్ రిటైర్ అయ్యే సమయానికి ఎంత వేతనం డ్రా చేస్తారో అంత మొత్తాన్ని ప్రమోద్ కుటుంబానికి అందచేస్తామని చెప్పారు.
గాజుల రామారంలో...
మావోయిస్టుల దాడిలో మరణించిన 33 పోలీసులకు సంబంధించిన కుటుంబాలకు గాజుల రామారంలో ఇంటిస్థలం కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఇటీవలి కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని, జనజీవన స్రవంతిలో కలవాలని రేవంత్ రెడ్డి మావోయిస్టులకు పిలుపు నిచ్చారు. పోలీస్ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాంతి భద్రతలను పరిరక్షణలో భాగమైన పోలీసులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "అమరులు వారు" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.