SlBC Accident : సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగుస్తుందా? నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అవుతుందా?

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో గల్లంతైన కార్మికుల మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Update: 2025-04-18 06:05 GMT

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో గల్లంతైన కార్మికుల మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేటికి రెస్క్యూ ఆపరేషన్ 56 రోజులకు చేరుకున్నప్పటికీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ లభించలేదు. అయితే మృతదేహాలు ఉన్నాయని అంచనా వేసిన డీ 2 ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం పన్నెండు సహాయక బృందాలు 650 మంది సిబ్బంది మూడు షిఫ్ట్ లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా మృతదేహాల ఆచూకీ ఇప్పటి వరకూ లభించలేదు.

తొలగింపు పనులు...
నేటికీ టీబీఎం మిషన్ తొలగింపు పనులతో పాటు పేరుకు పోయిన బురదను తొలగించే కార్యక్రమం మాత్రం ఊపందుకుంది. ఈ మేరకు టన్నెల్ లో పేరుకుపోయిన పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి, టీబీఎం శకలాలను, బండరాళ్లను బయటకు తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. డీ 2 ప్రాంతంలో ఐదుఎస్క్ వేటర్ల సాయంతో బండరాళ్లను తొలగించే పనిలో ఉన్నారు. ఈ బురద, బండరాళ్లు తొలగిస్తే మాత్రం మృతదేహాలు బయటపడే అవకాశముందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి.
అనుమానిత ప్రాంతంలో...
అయితే ప్రస్తుతం అనుమానిస్తున్న డీ1 డీ 2 ప్రాంతాల్లోనే మృతదేహాలు ఉంటాయా? ఉంటే అవి ఎన్ని అడుగుల మేరకు లోపలకు కూరుకుపోయి ఉంటాయి? అన్న దానిపై అథ్యయనం చేస్తున్నారు. మృతదేహాలు పాడవకుండా బంధువులకు అప్పగించాలంటే తవ్వకాలు జాగ్రత్తగా జరపాలని, ఇందుకోసం పెద్దపెద్ద మిషన్లను ఉపయోగించకూడదని నిర్ణయించారు. చిన్న చిన్న పారలతోనే తవ్వకాలు జరిపితేనే మృతదేహాలు గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటాయని, దాని వల్ల బంధువులకు అప్పగించవచ్చని కూడా భావిస్తున్నారు. ఉబికి వస్తున్న నీటిని కూడా బయటకు పంపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గ్రిల్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు.



Tags:    

Similar News