SLBC Accident : ఎనిమిది మంది జాడ తెలిసేదెన్నడు... సన్నగిల్లిన ఆశలు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక బృందాలు చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం చివరి దశకు చేరింది.

Update: 2025-03-01 03:35 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక బృందాలు చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం చివరి దశకు చేరింది. ఇప్పటికే ఎనిమిది రోజులు కావస్తుండటంతో ఎనిమిది మంది కార్మికులు బతికి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. అయితే తాజాగా రెస్క్యూ టీం కార్మికుల చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే అధికారులు దీనిని ధృవీకరించడం లేదు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని అయితే గుర్తించారు కానీ వారి జాడ మాత్రం తెలియరాలేదు. తాము గుర్తించిన ప్రాంతాన్ని స్కానింగ్ చేశారు. గత శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగి టన్నెల్ లో బురద, నీరు పడిపోవడంతో కార్మికులు బతికే అవకాశం లేదని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

అంబులెన్స్ లో చేరుకోవడంతో...
ఇప్పటికే శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ లు చేరుకున్నాయి. కార్మికులు వేర్వేరు చోట్ల బురదలో చిక్కుకుపోయినట్లు కనుగొన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దానిని అధికారులు నిర్ధారించడం లేదు. అయితే స్పాట్ కు చేరుకోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు కూడా కూడా ఆపరేషన్ రెస్క్యూ ప్రారంభమయింది. ఈ రోజు సాయంత్రానికి కార్మికుల జాడ తెలిసే అవకాశముందని అధికారులు చెబుతన్నారు. మొత్తం పదకొండు బృందాలు నిరంతరం శ్రమిస్తూ కార్మికుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా ఎనిమిది రోజుల నుంచి కన్పించడం లేదు.
కార్మికుల జాడ...
బురదను, నీటిని తోడారు కానీ కార్మికులు ఎక్కడ ఉన్నారన్నది ఇంత వరకూ తెలియరాలేదు. మొత్తం టన్నెల్ లోపల ఐదు ప్రాంతాలను గుర్తించి అక్కడే కార్మికులు ఉండే అవకాశముందని అంచనా వేసుకున్నారు. కార్మికులు బతికి ఉంటే కనీసం సహాయక బృందాలు వచ్చినప్పుడయినా కదలికలతో పాటు మాటలు వినిపించేవని, అవేమీ లేకపోవడంతోనే అనుమానం కలుగుతుందని లోపలికి వెళ్లి వచ్చిన సహాయక బృందాలు చెబుతున్నాయి. మొత్తం టన్నెల్ లో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి కార్మికుల జాడ తెలిసే అవకాశముందని సహాయక బృందాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. 


Tags:    

Similar News