SlBC Accident : రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకున్నా.. ఫలితం లేదే?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ నేటికీ కొనసాగుతుంది.
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ నేటికీ కొనసాగుతుంది. ఈరోజుకు యాభై నాలుగు రోజులకు చేరుకుంది. తప్పిపోయిన ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతరం కొనసాగుతున్న సహాయక చర్యలతో ఆపరేషన్ వేగంగా ముందుకు సాగుతుంది. అయినప్పటికీ ఆరుగురు మృతదేహాలు మాత్రం ఇంకా లభించలేదు. సొరంగంలో పేరుకు పోయిన బురదను, టీబీఎం శకలాలను తొలగించే పని కూడా ఊపందుకుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా సహాయక బృందాలు బయటకు తరలిస్తున్నాయి. దాదాపు తొమ్మిది అడుగుల మేర బురద పేరుకు పోవడంతో ఇంకా వెలికి తీత పనులు ఆలస్యం అవుతుంది.
చివరి ఇరవై మీటర్లలోనే...
టన్నెల్ లో చివరి ఇరవై మీటర్లలోనే మృతదేహాలు ఉంటాయని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉండటంతో చాలా జాగ్రత్తగా తవ్వకాలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీ1 ప్రదేశంలో మట్టి తొలగింపు పనులు పూర్తయితే తప్ప మృతదేహాలు బయట పడే అవకాశం లేదు. అత్యాధునికపరికరాలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు దెబ్బతినకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా తవ్వకాలు చేపడుతున్నారు. బంధువులకు కనీసం మృతదేహాలను అప్పగించగలగితే 90 శాతం విజయం సాధించినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
నిపుణుల సూచనల మేరకు...
నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని మరీ జాగ్రత్తగా టన్నెల్ లో సహాయక బృందాలు అడుగులు వేస్తున్నాయి. కాస్త లేటయినా మృతదేహాలను పాడవకుండా అప్పగించాలన్న ఉద్దేశ్యంతోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొకవైపు ప్రమాదకరమైన పరిస్థితులు టన్నెల్ లో ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. పైకప్పు నుంచి నీరు ఇంకా ఉబికి వస్తుండటంతో దానిని అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలయినంత త్వరలోనే మృతదేహాల ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశాభావాన్ని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు వ్యక్తం చేస్తున్నారు.