మల్లారెడ్డి కాలేజీలో కోట్లలో నగదు పట్టివేత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లెక్కల్లో చూపని రూ.1.4 కోట్ల నగ

Update: 2023-06-22 16:18 GMT

Mallareddy

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లెక్కల్లో చూపని రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలపై బుధవారం దాడులు చేసిన ఈడీ అధికారులు విచారణలో వెళ్లడైన వివరాల ఆధారంగా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మల్లారెడ్డి వైద్య కళాశాల నుంచి కోటి నలభై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలో ఉన్న మరో రెండు కోట్ల ఎనభై లక్షలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 12 మెడికల్ కాలేజీలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటి మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని MNR మెడికల్ కాలేజీ, బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీ, ప్రతిమ మెడికల్ కాలేజీ, డెక్కన్, SVS కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 16 చోట్ల తనిఖీలు జరిగాయి. పీజీ, మెడికల్ సీట్లను బ్లాక్ చేసినందుకు ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్‌తో పాటు పలుచోట్ల తనిఖీలు చేశామన్నారు. కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వెళ్లడైన ఆధారాల నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులు పెట్టినట్టు తెలిపారు.

ఇటీవల జరిపిన సోదాల్లో, మెడికల్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి అక్రమంగా వసూళ్లు చేశారంటూ మల్లా రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలోని రూ.2.89 కోట్లను కూడా ఈడీ స్తంభింపజేసింది. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ కుంభకోణానికి సంబంధించి జూన్ 21న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సీట్లను బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఈడీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక మార్కులు సాధించిన పీజీ నీట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఉపయోగించి సీట్లు బ్లాక్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఖాళీ సీట్లు ఉన్నాయని చెప్పి కోట్లల్లో పీజీ సీట్లు అమ్ముకున్నారని ఈడీ చెబుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News