Telangana : ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ కు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి చెందారు
తెలంగాణ కు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి చెందారు. ఈరోజు ఉదయం అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అందెశ్రీని కుమారులు ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఆయన ఆసుపత్రికి తీసుకు వచ్చిన సమయంలోనే సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మృతి తీరని లోటు అని పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడే...
ఆయన ఒక్కసారిగా ఇంట్లో పడి పోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారని తెలిసి అనేక మంది గాంధీ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందెశ్రీ రచించారు. జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్రానికి అందించారు. తెలంగాణ ఉద్యమ గీతాలను రచించారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ మరణించడం పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన అందించిన రాష్ట్ర గీతానికి కొత్త బాణీ సమకూర్చేందుకు ఆయనతో కలసి కూర్చున్న ఘటనలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.