Telangana : కరెంట్ కోతలు షురూ.. రేవంత్ సర్కార్ రివర్స్ గేర్

తెలంగాణ లో విద్యుత్తు కోతలు మళ్లీ మొదలయ్యాయి. ఇవి అనధికారిక కోతలని అంటున్నారు

Update: 2025-02-07 05:59 GMT

తెలంగాణ లో విద్యుత్తు కోతలు మళ్లీ మొదలయ్యాయి. ఇవి అనధికారిక కోతలని అంటున్నారు. గతంలో ఎన్నడూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగేది కాదు. కానీ ప్రతి రోజూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంలో విద్యుత్తు వినియోగం ఎక్కువ కావడంతో ఇక్కడ మాత్రమే అమలు చేస్తున్నారని అనుకోవడం భ్రమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనధికార కోతలు అమలవుతున్నాయి. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజల్లో అసహనం బయలుదేరింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యుత్తు సరఫరా విషయంలో బాగుందన్న అభిప్రాయం బలపడే అవకాశాలు క్రమంగా మెరుగవుతున్నట్లు కనిపిస్తుంది. స్థానికసంస్థల ఎన్నికల్లో ఈ విద్యుత్తు కోతల ప్రభావం చూపే అవకాశముంది.

నిర్వహణ పేరిట...
మెయిన్ టెయిన్స్ పేరిట ఒక్కో ఏరియాలో మూడు నుంచి నాలుగు గంటల పవర్ కట్ లను విద్యుత్తు శాఖ అధికారికంగా అమలు చేస్తుంది. అదేమంటే చెట్లు నరికివేత, ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల పేరు చెప్పి ఒకే ప్రాంతంలో ఒకే నెలలో రెండు మూడు సార్లు విద్యుత్తు కోతలను అమలు చేస్తుండటంతో ఇది మెయిన్ టెయిన్స్ కాదని, కోతల్లో భాగమేనని ప్రజలు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందన్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఇక రానున్న కాలంలో మరింతగా అనధికార కోతల వేళలు పెరుగుతాయంటున్నారు. అయితే పాలకులు నిరంతరాయం విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్న ప్రకటనలు ఆచరణలో కనిపించడం లేదు.
గరిష్ట ఉష్ణోగ్రతలు
నిన్న ఒక్కరోజులోనే 15, 752 మోగావాట్ల విద్యుతు డిమాండ్ తెలంగాణలో ఏర్పడటంతో అధికారులు కిందా మీదా పడ్డారు. ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో గరిష్ట స్థాయిలో అంటే 36 డిగ్రీల వరకూ ఉష్నోగ్రతలు నమోదు కావడంతో ఇక ఫ్యాన్లు, ఏసీల వాడకం తప్పని సరి అయింది. ఉదయం వేళ చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో గీజర్ల వాడకం పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్తు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో విద్యుత్తు శాఖ అధికారులు అనధికారిక కోతలను అమలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. మళ్లీ ఇన్వెర్టర్ల కాలం వచ్చేసిందంటూ నెట్టింట కామెంట్స్ వినపడుతున్నాయి. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోతే మాత్రం రేవంత్ సర్కార్ కు బ్యాడ్ నేమ్ మాత్రం వచ్చి ఎన్ని పథకాలు అమలు చేసినా తుడిచిపెట్టుకుపోతుందన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యుత్తు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వేసవిలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు.


Tags:    

Similar News