రక్తసంబంధాన్ని రాజకీయమే డామినేట్ చేస్తుందిగా?

రక్తసంబంధాన్ని రాజకీయం డామినేట్ చేస్తుంది, తెలంగాణలో కేటీఆర్, కవిత, ఆంధ్రప్రదేశ్ లో జగన్, షర్మిలలు రక్షాబంధన్ వేడుకలకు దూరంగా ఉన్నారు

Update: 2025-08-09 13:13 GMT

రక్తసంబంధాన్ని రాజకీయం డామినేట్ చేస్తుంది. ఎందుకంటే తమకు అనుబంధం కంటే పాలిటిక్స్ ముఖ్యమని భావించే వారు ఎక్కువగా ఉన్నారు. పాలిటిక్స్ లో ఉన్న పరపతి, రాజకీయంలో ఉన్న కిక్కు రక్తసంబంధంలో ఉండవని మరోసారి స్పష్టమయింది. అన్నా చెల్లెళ్లు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రరక్షాబంధన్ కు దూరంగా ఉండటమంటే వారికి రాజకీయాలే ఎక్కువన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పదవుల కోసం కొందరు, ఆస్తుల కోసం మరికొందరు రక్తసంబంధాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వచ్చారంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అన్నాచెల్లెళ్ల మధ్య పెరుగుతున్న సంబంధాలు రక్షాబంధన్ కు దూరం చేస్తున్నాయి.

కేటీఆర్, కవిత...
తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇద్దరూ మొన్నటి వరకూ అన్నాచెల్లెళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు బయటకు కనిపించలేదు. కల్వకుంట్ల కవిత ప్రతి ఏడాది తన సోదరుడు కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టి ఆశీర్వచనం తీసుకునే వారు. అలాంటి కవిత నేడు రక్షాబంధన్ ను కేటీఆర్ కు కట్టకపోవడం రాజకీయంగానే కాదు సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఇటువంటి సంస్కృతికి అద్దం పట్టేలా ఈ అన్నా చెల్లెళ్లు వ్యవహరిస్తున్న తీరును కొందరు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. అయితే కేటీఆర్ పార్టీ పనిమీద ఢిల్లీ వెళ్లడంతో రక్షాబంధన్ వేడుకలకు వెళ్లలేదని సమర్థించుకున్నప్పటికీ, ఈ ఏడాది మాత్రమే ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్నలకు కల్వకుంట్ల కుటుంబం నుంచి జవాబు లేదు.
జగన్.. షర్మిల...
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా రక్షాబంధన్ కు దూరంగా ఉన్నారు. అయితే వీరిద్దరూ రాఖీ పండగ వేడుకకు దూరంగా ఉండటం తొలి ఏడాది మాత్రం కాదు. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. బంధానికి బీటలు వారింది. రాజకీయ పదవులతో పాటు, ఆస్తి తగాదాలు కూడా వీరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ బెంగళూరులోనూ, షర్మిల హైదరాబాద్ లోనూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా చెల్లెళ్లు అన్నలపై రాజకీయ పోరాటం చేస్తుండటంతో రాఖీ పౌర్ణమి వేడుకకు ఈ రెండు కుటుంబాలు దూరంగా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ప్రజలకు నీతులు చెప్పే నాయకులు తాము అనుసరించే ఆచార వ్యవహారాలను జనం గమనిస్తున్నారన్న విషయం కూడా మర్చిపోయినట్లే కనపడుతుంది.


Tags:    

Similar News