BRS : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్ణయంపైనే ఉత్కంఠ
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారి ఎటు అన్నది తేలనుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి, ఇండి కూటమికి దూరంగా ఉంటోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారి ఎటు అన్నది తేలనుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి, ఇండి కూటమికి దూరంగా ఉంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను, బీజేపీని అదే స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అయితే ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరుపున సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఆయన తమిళనాడుకు చెందిన నేత. మరొకవైపు ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మామూలుగా అయితే కాంగ్రెస్ కూటమికి దూరం కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఇండి కూటమి అభ్యర్థి కంటే తెలంగాణ వ్యక్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వడం ఇప్పుడు బీఆర్ఎస్ కు అనివార్యంగా మారింది.
గతంలో జరిగిన ఎన్నికల్లో...
2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే కూటమికి సపోర్టు చేయాల్సి ఉంది. రాజ్యసభలో బీఆర్ఎస్ కు నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నలుగురు ఎవరికి ఓటేస్తారన్నది ప్రజలకు తెలియాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు కేసీఆర్ ఆదేశాల మేరకే తమ ఓటును ఎవరికైనా వేసే అవకాశముంది. కానీ తెలంగాణ వాదిగా బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని ఇప్పటకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ వాదిగా...
అందులో ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. న్యాయకోవిదుడిగా పేరుంది. వివాదరహితుడిగా ఆయన పేరును ఇండి కూటమి బరిలోకి తెచ్చినా రాష్ట్ర రాజకీయాలను చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తుంది. ఫార్ములా ఈ కారు రేసు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి వాటితో కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి మద్దతిస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్టుగా బీఆర్ఎస్ నిలుస్తుందా? లేక జాతీయ స్థాయిలో మిత్రత్వం సాధించుకునేందుకు బీజేపీ మద్దతిచ్చిన రాధాకృష్ణన్ కు అండగా నిలుస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. కానీ తెలంగాణ వాదికా? లేక ఇతరులకా? అన్నది తేల్చుకోవాల్సి ఉంది.
కేటీఆర్ మాత్రం...
అయితే కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థికి తాము మద్దతివ్వబోమని కేటీఆర్ తెలిపారు. తాము ఏ కూటమిలో లేమని తమను ఎవరూ సంప్రదించలేదని ఆయన అనడంతో వారి మొగ్గు ఎటువైపు అన్నది అర్థమయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగానే తమ వైఖరి ఉంటుందన్నిఆయన, బీసీ అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పడంతో కేసీఆర్ నిర్ణయం అనుకూలంగా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అవ్వడంతో ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.