Raja Singh : రాజాసింగ్ పై బీజేపీ నిర్ణయం మారిందా? పార్టీ నాయకత్వం ఆలోచన అదేనా?
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇందుకు కారణం రాజాసింగ్ కూడా కూడా వెనక్కుతగ్గడమే కారణమని సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం ఈ నెల 11వ తేదీన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తర్వాత రాజాసింగ్ మాత్రం తాను ఏ పార్టీలో చేరనని, తాను మోదీ, అమిత్ షాలకు వీర విధేయుడినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమన్నా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ తెలిపారు. అదే సమయంలో గోషామహల్ బీజేపీకి అడ్డా అని, ఇక్కడ ఎవరు పోటీ చేసినా విజయం ఖాయమని ఆయన అన్నారు.
విరమించుకుందా?
మరొక వైపు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన నాయకత్వం ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సహజంగా పార్టీకి రాజీనామా ఆమోదించిన తర్వాత పార్టీ నాయకత్వం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ బీఫారం పై పోటీ చేసి గెలుపొందిన రాజాసింగ్ ను స్పీకర్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసే అవకాశముంటుంది. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం రాజీనామాను ఆమోదించి దాదాపు పన్నెండు రోజులవుతున్నా స్పీకర్ కు లేఖ రాయకపోవడంతో తిరిగి రాజీనామాపై ఆలోచన చేస్తుందని చెబుతున్నారు. రాజాసింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పక్కా హిందుత్వ వాదిగా ముద్రపడటంతో ఆయనను బయటకు పంపించే ప్రయత్నాన్ని విరమించకుందని చెబుతున్నారు.
తగ్గినట్లుగానే...
దీనికి తోడు రాజాసింగ్ కూడా బీజేపీ తన రాజీనామా ఆమోదించిన తర్వాత చాలా తగ్గినట్లు కనిపిస్తుంది. రాజీనామా ఆమోదించిన తర్వాత ఎలాంటి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడంతో పాటు తాను మోదీ, షాలకు విధేయుడినని ప్రకటించుకోవడం కూడా మళ్లీ బీజేపీలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీనికి తోడు తాజాగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.రాజా భాయ్ ఎక్కడున్నా గౌరవిస్తామని అరవింద్ అన్నారు. ఆయన సస్పెండ్ కాలేదు పార్టీకి రాజీనామా మాత్రమే చేశారన్న అరవింద్, పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం తీసుకోవచ్చని కూడా తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా భాయ్ రాజీనామా చేశారని ధర్మపురి అరవింద్ అనడం కూడా రాజాభాయ్ రిటర్న్ అవుతారన్న టాక్ వినిపిస్తుంది.