కేసీఆర్ ప్రసంగంపై పొంగులేటి అభ్యంతరం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లాగా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు.గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందన్న పొంగులేటి, అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు.
అందుకే విలన్ గా...
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించిందని, రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే.. ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగిందని, కేవలం రెండుసార్లే కేసీఆర్ వచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్ వెళ్లలేదన్న పొంగులూటి కేసీఆర్ దొర మాదిరిగా పరిపాలిస్తే.. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు.