Telangana : హిల్ట్ పాలసీపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏమన్నారంటే?

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు

Update: 2025-12-01 12:03 GMT

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఈ విషయంలో ఏకమై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడటానికే ఈ హిల్ట్ పాలసీని ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకు ఇచ్చిన భూములను కన్వర్షన్ చేసే అవకాశం లేదని తెలిపారు. నగరంలో ఉన్న పరిశ్రమల యజమానులకు సొంత భూములుండి, పట్టాలున్న వారికి మాత్రమే కన్వర్షన్ ఫీజు పెట్టామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు.

కాలుష్యం నుంచి కాపాడాలనే...
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారన్నారు. ఢిల్లీ ప్రస్తుతం కాలుష్య నగరంగా మారిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదనే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నగరంలో ఉన్న పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే హిల్ట్ పాలసీ వచ్చిందని దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానుకుని, అభివృద్ధి తో పాటు నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News