Rain Alert : బలహీన పడిన అల్పపీడనం.. కానీ నాలుగు రోజులు వర్షాలు తప్పవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది

Update: 2025-06-29 04:11 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచినలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

బలమైన గాలులు...
ఈదురుగాలులు బలంగా వీచే అవకాశముందని, హోర్డింగ్ లు, చెట్ల కింద నిలబడవద్దని కూడా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిహెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోనూ వర్షం పడే అవకాశమున్నందున జీహెచ్ఎంసీ అధకారులు అలెర్ట్ గా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు మెరుపులతో కూడిన...
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీన పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు తప్పవని చెప్పింది. ప్రధానంగా కొన్నిజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


Tags:    

Similar News