Rain Alert : అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు.. మూడు రోజులు హై అలెర్ట్
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. నైరుతి రుతుపవనాలు బలంగా వీయడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని చెప్పింది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పింది. రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడి భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలెర్ట్...
తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఖరీఫ్ సాగు సిద్ధమయిన రైతులకు ఈ వర్షం కొద్దిగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురిసే అవకాశముందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది. కుండపోత వర్షం కురిసే అవకాశమున్నందున ప్రజలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవనరమైతేనే బయటకురావాలని తెలిపింది. తెలంగాణలో ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో నాలుగు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపంది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదుగాలులు వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశమున్నందన ప్రజలు అలెర్ట్ గా ఉండాలని తెలిపారు.