Rain Alert : అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.. అతి భారీ వర్షాలతో ప్రభుత్వాలు అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్ల రాదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో భారీ అలలు ఉంటాయని తెలిపింది. అందుకే చేపల వేటను నిషేధించాలని పేర్కొంది.
తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకూ...
తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కురుస్తాయని తెలిపింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలోనూ మూడు రోజులు...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.