Rain Alert : 24వ తేదీ వరకూ జోరు వానలు తప్పవు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అదే సమయంలో తెలగాణలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతాయని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గరిష్టంగానే ఉంటాయని చెప్పింది. తెలంగాణలో ముప్పయి డిగ్రీలకు లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముప్ఫయి నుంచి ముప్ఫయి ఐదు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 24వ తేదీ వరకూ వర్షాలు పడతాయనితెలిపింది.
తెలంగాణలో ఈ ప్రాంతాల్లో...
పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని చెప్పింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం అంటే ఈరోజు మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్త గూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తురు నుంచి భారీ వర్షాలు పడతే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఏపీలో ఈ జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోనూ పలుజిల్లాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరువర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రం వేళ వర్షంపడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనూ, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల వర్షాలు పడతాయని తెలిపింది. అదేసమయంలో బలమైనఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ప్రధానంగా చిత్తూరు, శ్రీసత్యసాయి,అనంతపురం, నంద్యాల, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.