Rain Alert : తెలంగాణలో రెండు రోజుల వర్షాలు.. ఏపీలో లంక గ్రామాలకు హై అలెర్ట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-07-13 03:44 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమయిన తరుణంలో ఈ పడే వానలు సరిపడా ఉంటాయా? లేదా? అని పక్కన పెడితే నేలతడుస్తుందని మాత్రం చెబుతున్నారు. మరొకవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

మోస్తరు నుంచి తేలికపాటి...
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, హైదరాాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజుతేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది.
గోదావరి వరద ఉధృతితో...
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గోదావరి, కృష్ణా నదులకు వరద నీరు పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశముందని తెలిపింది. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అయితే విపత్తు నిర్వహణ సంస్థలో 112, 1070, 1800 425 0101 నెంబర్లకు సూచించారు. గొదావరి నదీపరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. గోదావరి స్నానాలకు దిగవద్దని కూడా సూచించింది.


Tags:    

Similar News