Weather Report : అక్కడ వర్షాలు..ఇక్కడ చినుకులు..ఖరీఫ్ సాగు సాగేదెలా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు వారాల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది
ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిరాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ కూడా జరుగుతుంది. కొండ చరియలు విరిగిపడటంతో వందలసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరొకవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు వస్తుండటంతో అనేక నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఎత్తిన అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై నెలలో వర్షాలు పడటం లేదన్నది మాత్రం వాస్తవం.
ఎగువన కురుస్తున్న వర్షాలతో...
శ్రీశైలం జలాశయానికి మూడు గేట్లు ఎత్తిన అధికారులు కిందకు నీటిని వదిలేశారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల్లో జల విద్యుత్తు జరుగుతుంది. ఇక నాగార్జునసాగర్ కు కూడా వరద నీరు పోటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరికతో అధికారులు గేట్లు ఎత్తి కిందకు విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిండు కుండను తలపిస్తుంది. కృష్ణా నది మాత్రమే కాకుండా గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దానికి అనుబంధంగా ఉన్న ఉప నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద కు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయకపోయినా కొన్ని లోతట్టు ప్రాంతాల గ్రామాలకు వరద నీరు చేరింది.
వర్షాలు లేక...
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గత కొద్ది రోజులుగా వర్షాలు లేవు. ఖరీఫ్ సాగు ప్రారంభమయిన తర్వాత వరుణుడు ముఖంచాటేయడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ప్రవేశించినప్పటికీ ఆశించన స్థాయిలో వర్షాలు ఈ నెలలో కురవలేదని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారీవర్షాలు పడాలంటే మరో రెండు వారాలు వెయిట్ చేయాల్సిందేనని చెబుతుంది. దక్షిణ భారత దేశంలో బలమైన ఈదురు గాలుల వల్లనే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి ప్రతికూలంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈ నెల 14 వతేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని మాత్రం చెప్పింది. వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ ను సాగు చేసిన రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.