Weather Report : ఐదు రోజులు భారీ వర్షాలు.. అతి భారీ వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వర్షాలు భారీగా పడే అవకాశముందని చెప్పింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడుతుందని తెలిపింది. అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు ఈ ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు భారీ వర్షాలు ఖరీఫ్ సాగుకు మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ చెబుతోంది.
తెలంగాణలో ఈ జిల్లాలో...
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల,ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిర్మల్, నిజామాబాద్, జతిగ్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగాం, భువనగిరి, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలకు భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పన్నెండు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. కొన్నిచోట్ల పిడుగులుపడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటలకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.