Rain Alert : ఐదు రోజులు కుండ పోత వర్షాలు తప్పవట... ఈ జిల్లావాసులు జాగ్రత్తగా ఉండాల్సిందే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ లు, మరికొన్న జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ లు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీవర్షాలు కొన్నిజిల్లాల్లో పడే అవకాశముందని, కొన్నిజిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటలకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
అతి భారీ వర్షాలు ఇక్కడ...
తెలంగాణాలో ఐదు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిజిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అతి భారీ వర్షాలుపడనున్న జిల్లాలుగా కామారెడ్డి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కుమ్రంభీం ఆసిఫాభాద్, ఆదిలాబాద్ లను పేర్కొంది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు హైదరబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు,మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరబాద్, రంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిని భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఏపీలో ఇక్కడ భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్నఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రంహెచ్చరించింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడుతుందని తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరువర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.