Rain Alert : మూడు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం పడే వర్షాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ఖరీఫ్ సాగు ప్రారంభం కావడంతో ఈ వర్షాలు ఖచ్చితంగా రైతాంగానికి మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కావడంతో అన్నదాతలకు తీపికబురు అని తెలిపింది.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్...
తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. ఈజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.
ఏపీలోనూ మూడు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ మూడు రోజలు పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతవరణ కేంద్రం తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. మిగిలిన ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది