Weather Report : రెండు రోజుల పాటు వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే రెండు రోజుల పాటు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని, అదే జరిగితే రెండు రోజుల తర్వాత భారీ వర్షాలు రెండు రాష్ట్రాల్లో కురవడం ఖాయమని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో ఇక్కడ...
తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక శ్రీరాం సాగర్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. రెండు రోజుల తర్వాత మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఏపీలో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల మేరకు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మరొకవైపు గోదావరి, కృష్ణనదులు ఉప్పొంగుతున్నాయి. వరద నీరు కొంత తగ్గుముఖంపట్టినా ఎగువ కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగానే గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.