Rain Alert : అందుకే మూడు రోజులు వర్షాలు.. తేల్చిచెప్పిన వాతావరణ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నెల 13వ తేదీ వరకూ వర్షాలు తప్పవని తేల్చింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదలడంతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ వరకూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగమామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో మూడు రోజులు...
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు చెట్లు, హోర్డింగ్ ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ కోరింది.