Weather Report : ఇదేందయ్యా... జులై నెల చివరిలోనూ మే నెల వాతావరణం.. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-07-16 03:33 GMT

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19వ తేదీ వరకూ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలియజేసింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదలడమే కాకుండా, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వాతావరణ శాఖ సూచనలు మేరకువర్షాలు పడటం లేదని ముఖ్యంగా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ఈ నెల 19వ తేదీ వరకూ...
తెలంగాణలోనూ ఈ నెల 19వ తేదీ వరకూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో చలి గాలులు తగ్గి ఉక్కపోత మొదలయింది. ఫ్యాన్లు, ఏసీలు నిరంతరంగా నడుస్తున్నాయి. విద్యుత్తు వినియోగం గత వారం రోజు లనుంచి పెరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించిన తొలినాళ్లలో ఒక మోస్తరు వర్షాలు కురిసినా తర్వాత మాత్రం ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాభావ పరిస్థితులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అల్పపీడనం ఏర్పడితేనే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, అయితే అప్పటి వరకూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకన్నాయి. ఉక్కపోత మొదలవ్వడంతో జులై నెలలో మే నెల వాతావరణాన్ని తలపిస్తుంది. విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ముప్ఫయి శాతం లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడినా ఆశించిన రీతిలో పడవని తెలిపింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News