Weather Report : మరో వారం వర్షాలేనట.. అయితే భారీ వర్షాలు లేవట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బలహీనపడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో కొనసాగుతుందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మోస్తరు వర్షాలే...
మరో ఆరు రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచిమోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల పదకొండో తేదీ వరకూ వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మేడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని, అలాగే ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ వర్షాలు...
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఆరు రోజుల పాటు వర్షాల పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు,మరికొన్నిజిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో నదులు ఉప్పొంగుతుండటంతో, కాల్వలు పొంగి ప్రవహిస్తుండటంతో వాటిని దాటే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ కాల్వలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా సూచించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద ఉండకుండా తగినజాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.