Rain Alert : మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అలెర్ట్ గా లేకపోతే ఇంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అదేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఏపీలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది.
ఐదు రోజులు తెలంగాణలో...
తెలంగాణలో ఐదు రోజుల పాటు రానున్న వారం రోజులపాటు అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈరోజు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీవర్షం కురిసే అవకావముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దని కూడా సూచించింది. ముఖ్యంగా సాయంత్రానికి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని కూడా అంచనా వేసింది.
పిడుగులతో కూడిన...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశమున్నందున రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తాటి చెట్లకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కూడా చెప్పింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, తెనాలి, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించింది.