Weather Report : వర్షాలు తప్పవు.. ఉష్ణోగ్రతలు తగ్గుతాయ్.. ఉక్కపోత ఉండదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కదలికలు ఎక్కువగా ఉండటంతో ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు రెండు రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలో మాత్రం చల్లటి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తెలంగాణలో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సాగుకు అనుకూలం...
ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని జిల్లాల్లో పడే అవకాశముందని, తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు పడతాయి కాబట్టి ఖరీఫ్ ప్రారంభం కావడంతో సాగు పనులు ప్రారంభమయ్యాయని, పడుతున్న వర్షాలు సాగుకు అనుకూలంగానే ఉంటాయని వ్యవసాయశాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలోనూ మోస్తరు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాలో భారీ వర్షంతో పాటు మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, మన్యం, పార్వతీపురంమన్యం జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని పేర్కొంది.