Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. అక్కడ వానలు.. ఇక్కడ చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి నెల మూడో వారం వరకూ చలితీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
చలి తీవ్రత ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. కొంత ఉష్ణోగ్రతలు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి నెల మూడో వారం వరకూ చలితీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే చలితీవ్రత ఇన్నాళ్లు కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు నుంచి చలితీవ్రత మళ్లీ పెరుగుతుందని తెలిపారు. మంచు దుప్పటి కప్సేసినట్లు రెండు తెలుగు రాష్ట్రాలు గత కొద్ది రోజులుగా విలవిలలాడిపోతున్నాయి. చలి దెబ్బకు అందరూ దాదాపు చప్పపడిపోయారు.
ఏపీలో వానలు...
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవైపు చలి, మరొకవైపు వానలు ఏపీని పట్టిపీడిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయనుకున్న దశలో వానలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.దీంతో పాటు దట్టమైన పొగమంచు కూడా కమ్మేస్తుంది. మొత్తం మీద ఏపీ ప్రజలు వింత వాతావరణాన్ని చూస్తున్నారు. చలి తీవ్రత కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగమంచు భారీగా...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత మరికొద్దిరోజులు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వారం రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశముందని హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి పూట గరిష్టంగా ఇరవై నుంచి ఇరవై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి వేళ ఇరవై కి లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.