Telangana : గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి బోనస్ ప్రకటించింది
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి బోనస్ ప్రకటించింది. దీపావళి కానుకగా 400 కోట్ల రూపాయల బోనస్ ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నానని భట్టి అన్నారు. ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల పాపం బీజేపీదే...
బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈనెల 18న రాష్ట్రంలోబీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అందుకు ప్రయత్నించాలని కిషన్ రెడ్డిని మల్లు భట్టి విక్రమార్క కోరారు. సుప్రీంకోర్టు తీర్పు కాఫీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.