టీ కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు.. సొంత పార్టీలోనే నిప్పుల కుంపటి

టీ కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో మైనంపల్లి పెట్టిన చిచ్చుతో రెండు జిల్లాల డీసీసీ అధ్యక్షులు..

Update: 2023-10-04 06:37 GMT

ఒక వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్‌ కూడా ముందస్తు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతుంటే షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. సొంత పార్టీలోనే భగ్గుమనే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒక వైపు ఎన్నికలు సమీపిస్తుండటం, మరో వైపు సొంతపార్టీలోనే వివాదాలు చెలరేగడం వంటివి టీ కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో మైనంపల్లి పెట్టిన చిచ్చుతో రెండు జిల్లాల డీసీసీ అధ్యక్షులు రాజీనామాలు చేశారు. వాళ్లిద్దరూ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. మరో కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ అయిన మనోహర్‌ రెడ్డి రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో టీ కాంగ్రెస్‌లో చిచ్చు కొనసాగుతూనే ఉంది.

టీ కాంగ్రెస్‌లో మైనంపల్లి చిచ్చు చల్లారట్లేదు. టీ కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్‌గిరి సీటు, ఆయన కొడుకు రోహిత్‌కు మెదక్‌ అసెంబ్లీ సీటు ఇస్తారనే వార్తలు కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. మొన్న మెదక్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా, నిన్న మల్కాజ్‌గిరి డీసీసీ ప్రెసిడెంట్‌ నందికంటి శ్రీధర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఢిల్లీకి పిలిపించి రాహుల్‌ గాంధీ స్వయంగా బుజ్జగించినా, ఎంపీ టికెట్ ఇస్తామన్నా నందికంటి లెక్క చేయలేదు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కన్నతల్లిలాంటి కాంగ్రెస్ మోసం చేయడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. దీంతో కాంగ్రెస్‌లో మైనంపల్లి చేరిక చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. టీ కాంగ్రెస్‌లో మైనంపల్లి రేపిన మంటలు చల్లారకముందే.. కొత్త మనోహర్‌రెడ్డి, సరికొత్త వివాదం రేపారు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప్రయత్నిస్తున్న వారి నుంచి రేవంత్‌.. కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారంటూ ఆరోపించారు మనోహర్‌ రెడ్డి. ఎమ్మెల్సీ క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి నుంచి రూ.6 కోట్లు, గాలి అనిల్ కుమార్ నుంచి 12 కోట్లు, రేవంత్‌ తీసుకున్నారని మనోహర్‌ ఆరోపించారు. దీంతో మనోహర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే తాను ఢిల్లీ వెళ్లి సీబీఐ, ఈడీకి రేవంత్‌పై ఫిర్యాదు చేస్తానంటున్నారు మనోహర్‌. మరి కాంగ్రెస్‌లో తలెత్తుతున్న వివాదాలు ఎటువైపు వెళ్తాయన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News